బెహ్రెయిన్ పై ఫిర్యాదు చేసిన ఏఎఫ్ఐ

వాస్తవం ప్రతినిధి:  భారత అథ్లెట్‌ సమాఖ్య(ఏఎఫ్‌ఐ) బహ్రెయిన్‌పై మంగళవారం ఆసియా క్రీడల నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మిక్స్ డ్ 4×400 రిలే లో బహ్రెయిన్‌ క్రీడాకారిణి కారణంగానే భారత్‌ స్వర్ణం చేజార్చుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. వీడియో ఫుటేజీలను నిపుణుల సమక్షంలో పరీక్షించి తమకు న్యాయం చేయాలని ఏఎఫ్‌ఐ కోరింది. వివరాల్లోకి వెళితే…. ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మిక్స్‌డ్‌ 4×400 రిలే పోటీలు నిర్వహించారు. మహ్మద్‌ అనాస్‌, పూవమ్మ, హిమదాస్‌, రాజీవ్‌ ఆరోక్యలతో కూడిన భారత జట్టు 3నిమిషాల 15.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌ 3 నిమిషాల 11.89 సెకన్లతో స్వర్ణం గెలిచింది. ఐతే, పోటీ మధ్యలో పూవమ్మ నుంచి బ్యాటన్‌‌ అందుకున్న హిమదాస్‌ పరిగెడుతుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పక్క లైన్‌లో పరిగెడుతోన్న బహ్రెయిన్‌ క్రీడాకారిణి ఆకస్మాత్తుగా కిందపడింది. అంతేకాదు హిమదాస్‌ పరిగెట్టే లైన్‌లోకి బహ్రెయిన్‌ క్రీడాకారిణి కాలు రావడంతో హిమ ఆమెను తప్పించుకుని పరిగెత్తాల్సి వచ్చింది. దీంతో కొద్దిపాటి ఆలస్యం జరిగింది. ఈ కారణంగానే భారత్‌ స్వర్ణం కోల్పోవల్సి వచ్చిందని ఏఎఫ్‌ఐ ఫిర్యాదులో పేర్కొంది. అయితే దీనిపై మేము ఆసియా క్రీడల నిర్వాహకులకు ఫిర్యాదు చేశాం. మేము చేసిన ఫిర్యాదుపై ఇతర దేశాలకు చెందిన వారు ఎవరూ ఇప్పటి వరకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నిపుణుల పర్యవేక్షణలో ఫుటేజీలను పరీక్షించి నిర్ణయం వెలువరించాలని కోరాం అని ఏఎఫ్‌ఐ ట్విటర్‌ ద్వారా తెలిపింది.