నాలుగో టెస్ట్ కు వోక్స్ దూరమయ్యే అవకాశాలు!

వాస్తవం ప్రతినిధి:  భారత్‌తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్‌లో వోక్స్‌ కనిపించలేదు. కుడి కాలి తొడ కండరాలు పట్టేయడంతో వోక్స్‌ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు తెలిపారు. దీనితో ఈ టెస్ట్ లో వోక్స్ ఆడుతాడా అనేది అనుమానంగా మారింది. గతంలోనూ ఇదే సమస్య కారణంగా వోక్స్‌ ఇంగ్లాండ్‌ జట్టులో చోటు కోల్పోయాడు. తాజాగా అతని గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతడు గురువారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో బెన్‌ స్టోక్స్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వోక్స్‌ 137 పరుగులతో నాలుగు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. వోక్స్‌ దూరమైతే ఆ స్థానంలో శాం కరన్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టులో గెలిచి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్‌ ఉవ్విళ్లూరుతోంది. మరోపక్క భారత్ నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.