ముస్కర్ కు రూ.75 లక్షల నజరానా ప్రకటించిన మధ్యప్రదేశ్

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో ఆర్చరీ క్రీడాకారిణి ముస్కర్ కిరార్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముస్కర్‌ కిరార్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.75లక్షల నజరానా ప్రకటించినట్లు తెలుస్తుంది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ ఫైనల్‌ విభాగంలో జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కర్‌ కిరార్‌లతో కూడిన భారత బృందం 228-231తేడాతో కొరియాపై ఓడిపోయి రజతం దక్కించుకున్నారు. రజతం గెలిచిన జట్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన ముస్కర్‌ సభ్యురాలు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.75లక్షల నజరానా ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ‘ముస్కర్‌… జబల్‌పూర్‌ జిల్లాకు చెందిన క్రీడాకారిణి. ఆసియా క్రీడల్లో ఆమె సాధించిన పతకంతో రాష్ట్రంతో పాటు దేశం గర్వపడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75లక్షల నజరానా అందజేయనుంది’ అని తెలిపారు.