ఎంతో ఆప్యాయంగా పలకరించే వారు : చిరంజీవి

వాస్తవం సినిమా: నందమూరి హరికృష్ణ మరణం చాలా దురదృష్టకరమని.. దుర్దినం అని ప్రముఖ నటుడు చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని, చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు.

హరికృష్ణ, తాను ఎప్పుడు ఎదురుపడ్డా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, సరదాగా జోక్స్ వేస్తూ.. నవ్వించే వారని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులు మనో స్థైర్యంతో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, చిరంజీవితో పాటు తనయుడు హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు.