హరికృష్ణ మృతదేహం వద్ద భోరున విలపించిన తనయులు కల్యాణ్‌రామ్‌, జూనియర్ ఎన్టీఆర్‌

వాస్తవం సినిమా: హరికృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరికృష్ణ మృతదేహం వద్ద ఆయన తనయులు కల్యాణ్‌రామ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ భోరున విలపించారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే షాక్‌కు గురైన వీరిద్దరూ.. హుటాహుటిన నార్కట్‌పల్లికి బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వారు తండ్రి హరికృష్ణ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
గతంలో ఎన్టీఆర్ అన్నయ్య జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత హరికృష్ణ కుటుంబం ఎంతో వేదన చెందింది. ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హరికృష్ణ పదేపదే చెప్పేవారు. ఈ మాటల్ని ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో సమయంలో పేర్కొన్నారు కూడా. మా అన్న జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత, ఆయనలా మరొకరికి జరగకూడదని ప్రతి రోజు దేవుడిని ప్రార్దిస్తుంటాము. అభిమానులకు కూడా సోదరుల వంటివారే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటి దగ్గర మనకోసం ఎదురు చూసే తల్లిదండ్రులకు బాధకలిగించవద్దు.. ప్రతి తండ్రికి నాన్నకు ప్రేమతో సినిమా అంకితం ఇస్తున్నట్టు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో వేడుక సమయంలో పేర్కొన్నాడు.