“చాలా రోజులైంది నిన్ను చూసి.. కలవాలి తమ్ముడు”అన్నాడు: నాగార్జున

వాస్తవం సినిమా: నందమూరి హరికృష్ణ మృతి తో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా తనదైన ముద్రను వేసిన హరికృష్ణకు నాగార్జునతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి సినిమాల్లో నటించారు. పలు సందర్బాల్లో వీరిద్దరు కలవడం – తరచుగా మాట్లాడుకోవడం కూడా చేసేవారు. తాజాగా హరికృష్ణ మృతితో నాగార్జున తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అదే సమయంలో హరికృష్ణ తనతో చివరిసారి మాట్లాడిన మాటలను నాగార్జున గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగంకు గురయ్యారు.
“చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు” అని తనతో చివరిగా ఫోన్ లో హరికృష్ణ మాట్లాడారని హీరో నాగార్జున కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. హరికృష్ణ మరణవార్తను తెలుసుకున్న తరువాత, తాను ఒంటరిని అయిపోయినట్టు అనిపిస్తోందని నాగ్ పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం హరికృష్ణ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్న నాగార్జున “ఐ మిస్ యూ అన్నా” అంటూ తన భావోగ్వేగాన్ని వ్యక్తం చేశారు.