అభిమానులకు హరికృష్ణ తన స్వహస్తాలతో రాసిన ఆఖరి లేఖ

వాస్తవం సినిమా: నందమూరి హరికృష్ణ మృతితో సినీ, రాజకీయ రంగాల్లో విషాదం నెలకొంది. మరో నాలుగు రోజుల్లో..సెప్టెంబరు 2 న తన పుట్టినరోజును జరుపుకోనున్న హరికృష్ణ అర్ధంతరంగా ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. నందమూరి హరికృష్ణ, తన అభిమానులకు చేసిన ఆఖరి విజ్ఞప్తి ఇది. ఆయన తన స్వహస్తాలతో రాసిన చివరి లేఖలో కేరళను ఆదుకోవాలని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం…

“సెప్టెంబర్ 2న నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా, ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. ఇందుచేత నా జన్మదిన సందర్భంగా, బేనరులు, ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, మందులు, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను”
ఇట్లు
నందమూరి హరికృష్ణ