జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ లో ఎన్ కౌంటర్….ఇద్దరు ముష్కరుల హతం!

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్‌ జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఒక ఇంట్లో దాగున్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకి చేరుకొవాదం తో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ  ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రసంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వారు ఉగ్ర సంస్థలోని డివిజనల్‌ కమాండర్‌ స్థాయి ఉగ్రవాదులని భావిస్తున్నారు. అనంతనాగ్‌ జిల్లాలోని మునివార్డ్‌ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించాయి. ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇంకా ముష్కరులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపేశారు.