ఆ పాపంలో ఇద్దరికీ ప్రమేయం ఉంది: జేసీ

వాస్తవం ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపం లో కాంగ్రెస్, టీడీపీల రెండింటి ప్రమేయం ఉందంటూ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుల ఉహాగానాలపై స్పందించిన ఆయన తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని… కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోందన్నారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని తేల్చేశారు. రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉందనీ.. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని తేల్చిచెప్పేశారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని, ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. నమ్మినవాడెవడూ మోసపోడని.. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేంటంటూ జేసీ వ్యాఖ్యానించారు.