హరికృష్ణ మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

 వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే.హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
హరికృష్ణ మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను పెడుతూ, నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని భావించానని, ఆ వెంటనే విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని, తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.