పైలట్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆ ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ ఏడాది మార్చిలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే పైలట్ భావోద్వేగానికి,మానసిక ఒత్తిడికి గురవడమే ఈ ప్రమాదానికి కారణమని తాజాగా దర్యాప్తు లో వెల్లడైంది. ఆ విమానమ కుప్ప కూలడం తో 51 మంది దుర్మరణం పాలయ్యారు. మార్చి 12న ఢాకా నుంచి కాఠ్‌మాండూ వచ్చిన యూఎస్‌-బంగ్లా ఎయిర్‌లైన్స్‌ విమానం త్రిభువన్‌ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. మరికాసేపట్లో విమానం ల్యాండ్‌ అవుతుందనగా ఒక్కసారిగా విమానం తన గమనాన్ని మార్చుకుని పక్కనే ఉన్న ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 51 మంది దుర్మరణం చెందారు. అయితే ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు అనేక కోణాల్లో విచారించారు. విమాన కెప్టెన్‌ అబిద్‌ సుల్తాన్‌ మానసిక ఒత్తిడే ఈ ఘటనకు కారణమని తాజాగా నివేదికలో  వెల్లడైంది. ప్రయాణ సమయంలో సుల్తాన్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యడని, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ ద్వారా తెలిసినట్లు, అంతేగాక.. జర్నీలో చాలా సార్లు సుల్తాన్‌ సిగరెట్లు తాగినట్లు అధికారులు గుర్తించారు. ‘కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ను పరిశీలించినప్పుడు సుల్తాన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమైంది. సరైన నిద్ర లేకపోవడంతో అతడు అలసిపోయినట్లు, చికాకుగా ఉన్నట్లు అన్పించింది. అంతేగాక ప్రయాణంలో అతడు చాలా సార్లు ఏడ్చినట్లు కూడా ఆ నివేదిక లో తెలిసింది.