ఫైనల్ లో ఓడిన సింధు….కానీ చరిత్ర సృష్టించింది!

వాస్తవం ప్రతినిధి: ఏషియన్ గేమ్స్ వుమెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో తెలుగు తేజం స్టార్ షట్లర్ పీ వీ సింధు ఓటమి పాలైంది. వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్‌లో సింధు ఓడిపోయింది. అయితే ఓడినా ఆమె చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడి బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫైనల్ ఫోబియా కొనసాగిన వేళ.. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింధు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించిన తై జు.. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్‌లో సింధును కోర్టు నలుమూలలా పరుగెత్తించడంతో ఆమె అలసిపోయినట్లు కనిపించింది. అక్కడక్కడా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడినా.. ఎప్పుడూ ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించకపోవడంతో సింధుకు ఓటమి తప్పలేదు.