‘సైరా’ సెట్ లో సందడి చేసిన బాలయ్య

వాస్తవం సినిమా: చిరంజీవి – బాలకృష్ణ. వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా తలపడిన వారే. బాక్సాఫీసు వద్ద పోటీ పడే విషయంలో సుదీర్ఘకాల ప్రత్యర్ధులైన వీరిద్దరూ, వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ‘సైరా’ షూటింగ్ జరుగుతూ ఉండగా, బాలయ్య అక్కడికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారట. చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ సెట్స్ కు వెళ్లి చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది. సైరా చిత్రీకరణ కూడా ఆ పక్కనే జరుగుతుందని తెలుసుకున్న బాలకృష్ణ వారికి ఇన్ ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే వెళ్లాడట.

బాలయ్య రాకతో చిరంజీవి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అని – ఇద్దరు దాదాపు గంట పాటు సరదాగా ముచ్చటించుకున్నారట. ఒకటి రెండు షాట్స్ చిత్రీకరణను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా సైరా చిత్రీకరణ సందర్బంగా వెళ్లడం జరిగింది. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. కాని బాలయ్య సైరా సెట్స్ కు వెళ్లిన విషయం మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో బాలయ్య – చిరులకు సంబంధించిన ఫొటోలు కూడా రాలేదు.