ముఖ్యమంత్రుల తో సమావేశమైన మోదీ,షా!

వాస్తవం ప్రతినిధి: 2019 లోక్ సభ ఎన్నికల కార్యాచరణ పై దృష్టిలో పెట్టిన భారతీయ జనతా పార్టీ అందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ పాలిత రాష్ట్రాల 15 మంది ముఖ్యమంత్రులతో సమావేశమైనట్లు తెలుస్తుంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి 15 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ సహా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మోదీ, అమిత్‌షా ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది.  సుపరిపాలన, పేదల అనుకూల పథకాలపై కూడా పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ఇరువురు సమీక్ష జరపనున్నారు. ఆయా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తుంది.