స్విమ్మింగ్ పూల్ లా మారిన ఢిల్లీ నగరం

వాస్తవం ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీ‌ నగరం స్విమ్మింగ్ పూల్ లా మారిపోయింది. ఈ రోజు ఉదయం అక్కడ భారీ వర్షం కురిసింది. సమీప గురుగ్రామ్‌ నగరంలో కూడా భారీ వర్షం పడింది. వర్షాల కారణంగా ఢిల్లీ‌లోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితో ఢిల్లీ‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గురుగ్రామ్‌లో భారీ వర్షంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాఠశాలలకు సెలవు  ప్రకటించారు. ఢిల్లీ‌ విమానాశ్రయం, సెంట్రల్‌ ఢిల్లీ‌ ఆర్కే పురం, తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తెల్లవారుజామున 3గంటల నుంచి 4గంటల మధ్య వాన కురిసింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి.