ఆటగాళ్ల కు బౌల్స్ లో సూప్,టీ అందించిన మంత్రి

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.  స్వయంగా మంత్రే బౌల్స్ లో సూప్,టీ పోసుకొని ప్లేటులో పెట్టుకొని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండోనేషియాలో ఆసియా క్రీడలు జరుగుతోన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఒలింపిక్‌ పతక విజేత, కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్ జకర్తాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆటగాళ్లను స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడుతున్నారు. అలాగే పతకం గెలిచిన క్రీడాకారులను ఎప్పటికప్పుడు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా రాథోడ్‌ ఆటగాళ్లందరూ కలిసి టిఫిన్స్‌, భోజనం చేసే డైనింగ్‌ హాల్‌ వద్దకు వెళ్లారు. అయితే క్రీడాకారులు ముందు మంత్రి వచ్చిన సంగతి గుర్తించక పోవడం తో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో రాథోడ్‌ బౌల్స్‌లో సూప్‌, టీ పోసుకుని ప్లేటులో పెట్టుకుని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. ఇంతలో మంత్రిని గుర్తించిన ఆటగాళ్లు ఆయన వద్దకు వచ్చి మాట్లాడారు.

ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ‘ఆటగాళ్ల కోసం సర్వర్‌గా మారిన మంత్రి’, ‘మంత్రిది ఎంత మంచి మనస్సో’.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.