చెట్లను నరికించిన మాజీ డీజీపీ..భారీ జరిమానాతో చుక్కలు చూపించిన ఎన్జీటీ!

వాస్తవం ప్రతినిధి: బాధ్యతాయుత పదవిలో ఉండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఓ మాజీ డీజీపీపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝళిపించింది. ఉత్తరాఖండ్‌లో డీజీపీగా పనిచేసిన బీఎస్ సిద్దు ముస్సోరి రిజర్వ్‌డ్ ఫారెస్టు భూమిని కొన్నాడు. అంతేకాకండా అక్కడున్న25 చెట్లను నరికివేయించి ఇంటిని నిర్మించుకున్నాడు.
ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రిజర్వ్‌డ్ ఫారెస్టు ఏరియాలో భూమిని కొనడమే కాకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లను తొలగించడంతో ఆయనపై ఎన్జీటీ బార్‌ అసోషియేషన్‌ ఫిర్యాదు చేసింది. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ మాజీ పోలీస్‌ అధికారి, అతణ్ణి దోషిగా తేల్చింది. నరికి వేయించిన మొత్తం చెట్ల ఖరీదుకు 10 రెట్లు చెల్లించాలని జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రాథోర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రూ. 45లక్షల జరిమానాను కూడా విధించింది. 1988 జాతీయ అటవీ విధానం, 1980 జాతీయ అడవుల పరిరక్షణ చట్టం ప్రకారం రిజర్వ్‌డ్ ఫారెస్టులో భూమి కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని గుర్తు చేశారు.