ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..వరవరరావు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినవారికి సహకరించారన్న ఆరోపణపై విరసం నేత వరవరరావును పూణే పోలీసులు అరెస్ట్ చేశారు 8 గంటలపాటు ఆయనను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నేరుగా పూణెకు తరలించనున్నారు. ఈ ఉదయం నుంచి హైదరాబాదులోని వరవరరావు నివాసంలో పూణె పోలీసులు సోదాలు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం వరవరరావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకు మొదట గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతామని చెబుతున్నారు. వరవరరావు మావోయిస్టు పార్టీ కార్యకర్తలతో కలసి మోదీ హత్యకు కుట్ర పన్నారని చెప్పే లేఖలు కొన్నాళ్ల కిందట పుణేలో దొరికాయి. కుట్రకు వరవరరావు నిధులు చేకూర్చాలన్నట్లు ఆ లేఖల్లో ఉందట.వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇంట్లోని వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరవరరావు అల్లుళ్లు ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్‌, నమస్తే తెలంగాణ విలేకరి క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో కూడా సోదాలు సాగాయి.