స్విమ్స్‌లో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య..ఆమె గదిలో లభ్యమైన సూసైడ్ నోట్

వాస్తవం ప్రతినిధి: వారం రోజుల వ్యవధిలో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగుతోంది. పీలేరుకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ శిల్ప గతవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివాదం కొనసాగుతుండగా ఎంబీబీఎస్ రెండో ఏడాది విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కడప జిల్లాకు చెందిన గీతిక (18) శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతోంది. తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన న్యాయవాదిగా పనిచేశారు. తిరుపతి శివజ్యోతినగర్ లోని ఎస్ వి ఎన్ క్లేవ్ అపార్టుమెంట్ లో తల్లి హరితదేవితో కలిసి ఉంటోంది. అయితే గీతిక నాలుగు నెలల క్రితం సుదర్శన్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను గీతికను రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి గీతికను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన గీతిక చదువుకుంటానంటూ ఆదివారం సాయంత్రం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో తల్లి చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్దలు కొట్టి చూసింది. అప్పటికి గీతిక కొన ఊపిరితో ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ గీతిక మృతిచెందింది.

రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో భాగంగా ప్రేమ వ్యవహారమే తన చావుకు కారణమంటూ గీతిక రాసిన సూసైడ్ నోట్ ఆమె గదిలో దొరికింది. జీవితం ఇలా అయిపోతుందనుకోలేదంటూ ఆమె అమ్మకు రాసిన లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తను లేకుండా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నానంటూ ఆ లేఖలో రాసింది గీతిక.