పెదకాకాని లోని పత్తి గోదాం లో భారీ అగ్నిప్రమాదం…భారీ ఆస్తినష్టం  

వాస్తవం ప్రతినిధి:  గుంటూరు జిల్లా పెదకాకానిలోని పత్తి గోదాం లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెదకాకాని లోని వాసవీనగర్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి గోదాంలో మంటలు చెలరేగి వేలాది పత్తి బేళ్లు దగ్ధమైనట్లు తెలుస్తుంది. అయితే విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌కారణంగానే మంటలు చెలరేగి ఇంత భారీ మొత్తం ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి ఏడు ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మిగతా బ్లాకులకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు ఆరు వేల పత్తిబేళ్లు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.12 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. నాలుగు పెద్ద గోదాముల ఈ సముదాయంలో.. మధ్య గోదాములో మంటలు చెలరేగడంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. నరసరావుపేట, విజయవాడ, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. అయితే మొదటి గోదాము, నాలుగో గోదాములో పాక్షికంగా మంటలు వ్యాపించినప్పటికీ.. మధ్య గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు.