దావూద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఎస్పీ ఎమ్మెల్యే

వాస్తవం ప్రతినిధి: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అన్న విషయం స్పష్టంగా తెలియక పోయినప్పటికీ ఆయన మాత్రం తన దందా ని నడుపుతూనే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దావూద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఆగస్టు 6న మీ ఈ మెయిల్ చెక్ చేసుకోండి అంటూ నా నంబర్‌కు సందేశం వచ్చింది. అయితే నేను ఆ మెసేజ్‌ను పట్టించుకోలేదు. మెయిల్‌ను తర్వాత చూద్దాం లే అనుకున్నాను. ఆగస్టు 8న అదే నంబర్ నుంచి మరో మెయిల్ వచ్చింది. మెయిల్ చూస్తే చివరి హెచ్చరిక..బతుకుతావా..చస్తావా..? అని ఉందని ఉమా శంకర్ పోలీసులకు తెలిపారు.  ఉమాశంకర్ నువ్వు బలియా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నావు. నీ సేవలను కొనసాగించాలంటే మాకు కోటి రూపాయలు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే నిన్ను చంపేందుకు ఒక్క బుల్లెట్ చాలు. నిన్న ఏ సమయంలోనైనా చంపేయొచ్చని దావూద్ ఇబ్రహీం ఫొటోతో కూడిన సందేశం ఉందని’ ఉమాశంకర్ సింగ్ పిర్యాదులో పేర్కొన్నారు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు.