రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు లో అవకతవకల పై ధర్నా కు దిగిన సోనియా

వాస్తవం ప్రతినిధి: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ కూడా ఈ రోజు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, మాజీ కేంద్రమంత్రి ఏకె.ఆంటొని, ఎంపీ అంబికా సోనీలు కూడా ఆమె తో పాటు ఆ ధర్నా లో పాల్గొన్నారు.. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ  డిమాండు చేస్తుంది. మిగిలిన ప్రతిపక్షాలు సైతం ఈ ధర్నాకు మద్దతు తెలిపాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి విజయ్‌గోయెల్‌ స్పందిస్తూ ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, ప్రధాని మోదీపై ఆరోపణలు చేసే ముందు వాటికి తగిన ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కూడా కాంగ్రెస్‌ ఎంపీలు హాజరు కాకపోవడం విశేషం.