దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు నుంచి సూర్యలత తొలగింపు

వాస్తవం ప్రతినిధి:రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గమ్మ చీర మాయం కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్ధాన పాలక మండలి సభ్యురాలు సూర్యలత కుమారిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన విలువైన చీర మాయం వెనుక పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతే ప్రధాన కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించడంతో గురువారం రాత్రి సూర్యలతను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ శాఖాపరమైన విచారణలో సూర్యలతపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయని, అందువల్ల తాము ఆమెను తొలగించామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ వెల్లడించారు.
ఈనెల 5న భక్తబృందం అమ్మవారికి తెచ్చిన ఆషాడ మాసం సారెలో ఖరీదైన చీర మాయం అయింది. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత కుమారిపై ఆరోపిస్తూ భక్త బృందం లిఖితపూర్వకంగా పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు. విషయం పెద్దది కావడం, మీడియాలో వార్తలు రావడంతో ఆలయ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దుర్గగుడి ఈవో, ఇన్ చార్జ్ కమిషనర్ పద్మ సమగ్ర నివేదిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆలయ ప్రధానార్చకులు, సిబ్బందిని విచారించిన అనంతరం పాలకమండలి సభ్యురాలు సూర్యలత కుమారి చీరను తీసుకెళ్లినట్లు నిర్ధారణ కావడంతో ట్రస్ట్ బోర్డు నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.