ఒక్క మ్యాచ్ లోనే 20 గోల్స్ చేసిన ఫుట్ బాల్ టీమ్

వాస్తవం ప్రతినిధి:  సాధారణంగా ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఒక జట్టు గోల్స్ కొట్టడానికి నానా కష్టాలు పడుతుంటుంది. అలాంటిది ఒక్క మ్యాచ్ లోనే కేవలం 90 నిమిషాల్లో ఒక జట్టు ఏకంగా 20 గోల్స్ కొట్టింది. ఇది నిజమేనా అని అనుకుంటున్నారా. నిజంగా నిజమే నండీ. జర్మనీలో గత బుధవారం బెఎర్న్‌ మునిచ్‌-రొటాచ్‌ ఎగర్న్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో మునిచ్‌ జట్టు ఆటగాళ్లు గోల్స్ మీద గోల్స్‌ నమోదు చేశారు. మ్యాచ్‌ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 7 గోల్స్‌ నమోదు చేసిన మునిచ్‌ ఆ తర్వాత మ్యాచ్‌ అయిపోయే సమయానికి మొత్తం 20 గోల్స్‌ సాధించింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఏ సమయంలోనూ మునిచ్ ఆటగాళ్లు కొట్టే గోల్స్‌ను అడ్డుకోలేకపోయారు. ఎగర్న్‌ జట్టు మొత్తం 2 గోల్స్‌ మాత్రమే సాధించింది. 88 నిమిషాల్లోనే మునిచ్‌ జట్టు 20 గోల్స్‌ నమోదు చేయడం విశేషం.

దీంతో ఎగర్న్‌ జట్టు 2-20తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మునిచ్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించగా పది మంది ఆటగాళ్లు గోల్స్‌ నమోదు చేశారు. మునిచ్‌ ఆటగాళ్ల గోల్స్‌ కొట్టిన వీడియోను అభిమానులు తెగ చూసేస్తున్నారు. పెద్ద ఎత్తున లైక్‌లు కొట్టేస్తూ కామెంట్లు పెడుతున్నారు.