పోలీస్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ జాబితా లో ఉగ్రవాది పేరు!

వాస్తవం ప్రతినిధి:  పోలీస్‌ ఉద్యోగం కోసం నిర్వహించే ఇంటర్వ్యూ జాబితాలో ఒక ఉగ్రవాది పేరు ఉండడం సంచలనం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్ లో పోలీసు నియామకాల కోసం నిర్వహించనున్న ఇంటర్వ్యూ కోసం 2,060 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే అందులో నాలుగు రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది పేరు ఉండటం గమనార్హం. సొపోర్‌కు చెందిన ఖుర్షీద్‌ అహ్మద్‌ మాలిక్‌ ఇటీవల శ్రీమాతా వైష్ణో దేవి యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేశాడు. పోలీస్‌ ఉద్యోగం కోసం జూన్‌లో నిర్వహించిన పరీక్షను మాలిక్‌ పూర్తి చేసి అర్హత సంపాదించాడు. దీనికి సంబంధించి నిర్వహించనున్న ఇంటర్వ్యూ కోసం ఉన్నతాధికారులు 2,060 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో మాలిక్‌ అర్హత సంపాదించడం విశేషం. కానీ అతడు మాత్రం నాలుగు రోజుల క్రితం బారా ముల్లా లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే.