భాగ్యనగరమంతటా బోనాల సందడి

వాస్తవం ప్రతినిధి: భాగ్యనగరమంతటా బోనాల సందడి నెలకొంది. ఆషాడం మూడో ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బోనాల సందడి కనిపిస్తోంది. పలు దేవాలయాల్లో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.ఇవాళ , రేపు నగరంలోని చాల ప్రాంతాలలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. మల్కాజ్‌గిరి, నేరెడ్‌మెట్, రసూల్‌పురా, పంజాగుట్లు, మెహీదీపట్నంలోని పలు ఆలయాల్లో బోనాలు ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. పాలబస్తీలోని లాల్‌దర్వాజలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. బోనాల జాతరను పురస్కరించుకుని ఎటువంటి ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా అదనపు పోలీస్‌ బలగాలను నియమించారు.

మరోవైపు నగరంలోని బోరబండలో పోచమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పట్టువస్ర్తాలు సమర్పించారు. మంత్రితోపాటు అమ్మవారిని ఎమ్మెల్యే గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఈ తెల్లవారుజామునుంచే పోటెత్తారు.