అద్భుతంగా రాణించిన సింధు…ఫైనల్ కు చేరింది!

వాస్తవం ప్రతినిధి: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు అద్భుత ఫామ్‌ ను కొనసాగిస్తుంది. ఇప్పటికే తన ఆట తో ఒక పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు స్వర్ణం కోసం తలపడనుంది. సెమీస్‌లో జపాన్‌ షట్లర్‌ యమగూచితో జరిగిన హోరాహోరీ పోరులో 21-16, 24-22 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించింది. సగర్వంగా ప్రపంచ బ్యాట్మింటన్ చాంపియన్ షిప్ లో  ఫైనల్‌ కు చేరింది. ఇంకొక్క మ్యాచ్‌ గెలిస్తే ఈ మెగా టోర్నీలో స్వర్ణం ఆమె సొంతమవుతుందన్న మాట. సెమీస్‌లో యమగూచితో పోరు అంత సులభంగా సాగలేదు. హోరాహోరీగా కొనసాగింది. ముఖ్యంగా రెండో గేమ్‌ ఊపిరి సలపనివ్వలేదు. సుదీర్ఘ ర్యాలీలు, చక్కని ప్లేస్‌మెంట్లు, ఇద్దరి మధ్యన మైండ్‌గేమ్‌తో నడిచింది. తొలి గేమ్‌లో 5 పాయింట్ల వరకు యమగూచిదే ఆధిపత్యం. ఈ క్రమంలో వరుసగా పాయింట్లు సాధించిన సింధు 8-8తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత 12-12 వరకు ఇద్దరూ చెరో పాయింట్‌ సాధిస్తూపోయారు. అనూహ్యం పుంజుకున్న సింధు ఆ తర్వాత చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు కొట్టి 18-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరికి 21-16తో గేమ్‌ కైవసం చేసుకుంది. అలానే రెండో గేమ్ కూడా చావో రేవో అన్నట్లు జరిగింది. దీనితో ఈ గేమ్ లో కూడా సింధు పుంజుకోవడం తో సెమీస్ లో సింధు విజయం సాదించింది.