శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

వాస్తవం ప్రతినిధి: శ్రీలంక ప్రధానమంత్రి ఆయన కుటుంబం ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబం తో పాటు  శ్రీలంక అధికారుల బృందం కూడా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. శ్రీలంక ప్రధానమంత్రి శ్రీ రాణిల్‌ విక్రమ సింఘే, ఆయన సతీమణి ప్రొఫెసర్‌ మైత్రి విక్రమసింఘే, శ్రీలంక అధికారుల బృందం శుక్రవారం ఉదయం ఆలయ మహాద్వారం నుంచి ప్రవేశించి ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లి విఐపి బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం.. రంగనాయక మండపంలో శ్రీలంక ప్రధానమంత్రి దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. శ్రీవారి లడ్డూ, తీర్థ ప్రసాదాలను, శ్రీ పద్మావతి సహిత వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శ్రీలంక ప్రధానమంత్రి దంపతులకు తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ….. తాను, తన కుటుంబ సభ్యులు రెగ్యులర్‌ గా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటామని, ఈ సారి భారత పర్యటన కోసం ఏర్పాట్లను చేయించిన భారత ప్రభుత్వానికి, ప్రత్యేకంగా తమ ప్రోటోకాల్‌ కోసం ఒక మంత్రిని ఏర్పాటు చేసి కనులారా శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడికి ధన్యవాదాలు అని తెలిపారు. అలానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిఅంశం పై కూడా విలేఖరులు ప్రశ్నించడం తో, ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని, కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళి లతో నిన్న ఫోన్‌ ద్వారా మాట్లాడానని శ్రీలంక ప్రధానమంత్రి పేర్కొన్నారు.