ప్రధాని పదవి తరువాత….ముందు బీజేపీ ని ఓడిద్దాం: మమత

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బెంగాల్ సి ఎం,తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కి ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై మమతా స్పందించారు. ఈ కీలకమైన అంశంపై ఆమె ఆచితూచి మాట్లాడారు. ముందు బీజేపీని ఓడిద్దాం.. తర్వాత అందరం కూర్చొని  ప్రధాని పదవి గురించి నిర్ణయిద్దాం అని మమతా అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. మీడియా తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దీనితో మమతా వ్యాఖ్యలను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేనట్లు మరోసారి స్పష్టమైంది. ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా వచ్చే ఏడాది జనవరి 19న తాను చేపట్టబోయే మెగా ర్యాలీకి మద్దతుగా రావాలని కోరుతూ వివిధ పక్షాల నేతలను ఆమె కలుస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించగా.. అందరినీ కలవడం తన బాధ్యత అని చెప్పి ఆమె తప్పించుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌పై మమతా తీవ్రంగా స్పందించారు. ఇలా అయితే పౌరయుద్ధం, రక్తపాతం తప్పవని ఆమె హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే మమత వ్యాఖ్యలను మరోపక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిప్పి కొట్టారు కూడా.