తెలంగాణకు హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

వాస్తవం ప్రతినిధి: తెలంగాణకు హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని… సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో కదంబ మొక్కను నాటి లాంఛనంగా ప్రారంభించారు. సీఎం మొక్క నాటిన తర్వాత సైరన్ వేయడంతో గజ్వేల్‌లో 1,16,000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. గజ్వేల్ వెళుతున్న ముఖ్యమంత్రి దారిలో సింగాయపల్లి అడవిలోపలికి వెళ్లి చాలా సేపు కలియదిరిగారు. తెలంగాణలో అడవుల పచ్చదనం పరిరక్షణకు గ్రీన్‌ బెటాలియన్స్‌ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు అవసరమైతే పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. అడవుల రక్షణకు అవసరమైన బడ్జెట్‌ను, సిబ్బందిని సమకూరుస్తామని చెప్పారు .అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న అధికారులకు రూ.5లక్షల రివార్డు ప్రకటించారు. అంతకముందు మేడ్చల్‌లో శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై సీఎం కేసీఆర్‌ ఆకాశమల్లె మొక్క నాటారు. హరిత హారం కోసంగా వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా ఎదిగిన ఆరోగ్యవంతమైన మొక్కలను తెప్పించారు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్ల నేరడు, కరివేపాకు, మునగ మొక్కలను తెప్పించారు.