ఇరాన్ తో చర్చలకు సిద్దమే అంటున్న ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికా,ఇరాన్ ల మధ్య యుద్ద వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటివరకు ఒకరి పై నొకరు నిప్పులు చెరిగిన ఇరు దేశ అధ్యక్షులు ఇప్పుడు చర్చ బాట పట్టనున్నారా, అని అంటే నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల అమెరికా ను బెదిరించాలి అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చర్చలకు సిద్దంగా ఉన్నానని చెప్పడం విశేషం. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీతో బేషరతు చర్చలకు తాను సిద్ధంగా వున్నానని ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఇటలీ ప్రధాని గుసెప్‌ కాంటెతో కలిసి ఆయన సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో జవాబిస్తూ తాను ఎవరితోనైనా కలిసిపోతానని, కలిసి ప్రయాణించటాన్ని తాను విశ్వసిస్తానని చెప్పారు. తాను ఇటీవల ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, నాటో దేశాధినేతలతో జరిపిన భేటీలను ఆయన గుర్తు చేస్తూ ఈ భేటీల ద్వారా సత్ఫలితాలను సాధించామన్నారు. ఇరాన్‌ ప్రభుత్వ నేతలు కోరుకుంటే తాను వారిని కచ్చితంగా కలుస్తానని, అయితే వారు ఇందుకు సిద్ధంగా వున్నారా? లేదా అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అర్ధరహితమైనది అని భావించినందు వల్లే దాని నుండి తాము వైదొలగామని ఆయన వివరించారు. వారు (ఇరాన్‌ నేతలు) తనతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని తాను భావించటం లేదని, వారు కోరుకుంటే ఎప్పుడైనా వారిని కలిసేందుకు తాను సిద్ధంగా వున్నానని ఆయన పునరుద్ఘాటించారు. తాము ఈ భేటీని అర్ధవంతంగా పూర్తి చేయగలిగితే పేపర్‌ వృధా అయ్యే మరో ఒప్పందం వుండదని, తాను వారితో కచ్చితంగా భేటీ అవుతానని ట్రంప్‌ చెప్పారు. వారు కోరుకుంటే తాను ఎప్పుడైనా వారిని కలిసేందుకు సిద్ధమేనని, ఇది తమ దేశానికే కాక వారికి, ప్రపంచానికి కూడా మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.