సత్యసాయి వేషధారణలో టిడిపి ఎంపి శివప్రసాద్‌ నిరసన

వాస్తవం ప్రతినిధి: రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ప్రాంగణంలో టిడిపి ఎంపిలు నిరసన తెలియజేస్తున్నారు.ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఎదుట రోజుకో వేషంతో నిరసన తెలుపుతున్న టీడీపీ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేడు పుట్టపర్తి సాయిబాబా వేషంలో వచ్చారు. సాయిబాబా వేషధారణలో పార్లమెంటుకు చేరుకున్న ఆయన, మిగతా టీడీపీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, సత్యము, ధర్మము, న్యాయము వంటి మానవతా విలువలేవీ లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న కనీస ధర్మాన్ని ఆయన విస్మరించాడని, సత్యవాక్కును మరచి, ఏపీకి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ, తన కళ్లు తెరచి, రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తెరగాలని హితవు పలికారు.