శివుడి వేషధారణలో తేజ్ ప్రతాప్ ప్రత్యేక పూజలు

వాస్తవం ప్రతినిధి: ఆర్‌జెడి అధినేత లాలుప్రసాద్ యాదవ్ కుమారుడు, యువనేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువ నేత తన వివాహ సందర్భంగా ఆదిదంపతులు శివపార్వతుల రూపంలో తన ఫోటోలను ప్రింట్‌ చేయించుకుని హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తేజ్‌ మరోసారి శివుడి అవతారాన్ని ధరించారు. పులి చర్మం ధరించి శివుడి వేషధారణలో పాట్నాలో ఉన్న శివాల‌యంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఢమరుకం మోగిస్తూ, హారతి సమయంలో శంఖాన్ని ఊదుతూ పూజ కొనసాగించారు.ఇక్క‌డ నుంచి ఆయ‌న‌ డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఓ దళితుడి ఇంటికి వెళ్లి బస చేయడంతో పాటు అక్కడ స్నానం చేశారు. అలాగే ఓ సైకిల్ యాత్ర కూడా చేసిన సంగతి తెలిసిందే.