రష్యా పై ఆంక్షలు కొనసాగుతాయి: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. యూరల్‌లోని నిర్థిష్ట దేశాలకు అమెరికా బాసటగా నిలిచినా ఆ దేశాలు రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ రష్యా పై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.  ‘రష్యా నుంచి యూరప్‌ దేశాలను తాము కాపాడుతుంటే..ఆ దేశాలు మాత్రం ఇంధన వనరుల కోసం రష్యాకు బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నాయి..ఇది ఎంత మాత్రం క్షేమకరం కాద’ని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇటలీ ప్రధాని గిసిప్పీ కాంటేతో వైట్‌హౌస్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోకు సభ్య దేశాల ఆర్థిక సహకారం నిలిచిపోయిందని, నాటో నిర్వహణ సంక్లిష్టమవుతోందని అన్నారు. నాటో తిరిగి బలోపేతమవుతుందని అంటూ నాటో సభ్య దేశాలు అమెరికా పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని ట్రంప్‌ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. నాటో వ్యయం అంతటినీ తమపై మోపడం తగదని అన్నారు.