భగ్గుమన్న మహారాష్ట్ర…రోడ్డెక్కిన మరాఠాలు.. 40 బస్సులకు నిప్పు!

వాస్తవం ప్రతినిధి: మరాఠాల రిజర్వేషన్ల వ్యవహారం మహారాష్ట్ర రాష్ట్రాన్ని భగ్గుమనేలా చేయటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. విద్యా.. ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక కోటా ఇవ్వాలన్నది మరాఠాల డిమాండ్. దీనిపై రోడ్లెక్కిన వారు.. తమ నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలతో వాతావరణాన్ని వేడెక్కించారు. వారి ఆందోళనలు కాస్తా శ్రుతి మించడంతో ఉద్రిక్తంగా మారింది. పూణె, నాసిక్ సహా మరాఠ్వాడా ప్రాంతమంతా ఆందోళనలు మిన్నంటాయి. రిజర్వేషన్లు కల్పించాలని నినాదం చేస్తూ ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. మరో వ్యక్తి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణాలతో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ఉస్మానాబాద్‌, షోలాపూర్‌, కొల్హాపూర్‌, నన్‌దర్బార్‌, ఔరంగాబాద్‌, బీడ్‌ జిల్లాలన్నీ సంపూర్ణంగా బంద్‌ పాటించాయి.ఈ ఆందోళనల కారణంగా పుణెలో దాదాపు 40 బస్సులకు నిప్పు పెట్టగా.. వందకు పైగా చిన్నా.. పెద్దా వాహనాల్ని ఆందోళనలకారులు ధ్వంసం చేశారు. పుణె నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కలిపే రహదారుల్ని దిగ్బంధనం చేయటంతో దారులన్నీ స్తంభించాయి. గంటల తరబడి ఆందోళనకారులు హైవేలను ఆక్రమించారు. అనేక చోట్ల పోలీసుల పైనా.. ప్రభుత్వ కార్యాలయాలపైనా రాళ్లు రువ్వారు. లాతూరులో 22 జిల్లాల నేతలు సమావేశమయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించే వరకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. మరాఠ్వాడాలు నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. 72వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మరాఠ్వాడాలు ఈ ఆందోళనకు దిగారు.