న్యూయార్క్ లోని ఒక అపార్ట్ మెంట్ లో కాల్పులు….నలుగురు మృతి!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాల్పుల ఘటన  చోటుచేసుకున్నాయి. క్వీన్స్‌ ప్రాంతంలోని ఆస్టోరియా సెక్షన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో ఓ ఐదేళ్ల బాలుడు సహా నలుగురు చనిపోయి కనిపించారు. అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో ఈ ఘటన జరుగగా నలుగురు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన వారిలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ నలుగురి మృతదేహాలపై తుపాకీతో కాల్చిన గుర్తులున్నాయని న్యూయార్క్‌ పోలీసు విభాగం విలేఖరులకు వెల్లడించింది. ఇవి హత్యలు అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కుటుంబీకుల్లో ఒకరు.. మిగతా వారిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకొని ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ వ్యక్తి గొంతు కూడా కోసి ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకీ లభ్యమైనట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలను గుర్తించే పనిలో పడ్డామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.