టీటీడీ కీలక నిర్ణయం..తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1 నుండి బ్రేక్‌ దర్శనం అమలు

వాస్తవం ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఉదయం 11.30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 7.30 గంటల వరకు బ్రేక్‌ దర్శనాన్ని అమలు చేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది . ప్రోటోకాల్‌ విఐపిలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి ప్రవేశ పెట్టినట్లు డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి తెలిపారు.

ఉదయం బ్రేక్‌ దర్శనానికి రావాలనుకునే ప్రోటోకాల్‌ విఐపి భక్తులు ఉదయం 8 గంటలకు, సాయంత్రం బ్రేక్‌ దర్శనానికి రావాలనుకునే భక్తులు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ఏఈవో కార్యాలయంలో (పీఏసీ సమీపంలో) సూచించిన నమూనా పత్రంతోపాటు ఆధార్‌ కార్డును జతచేసి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇకపై ఆలయాన్ని ఆరగంట ముందుగా ఉదయం 4.30 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు బదులు 9.30 గంటలకు మూయనున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఒక గంట పాటు బ్రేక్‌ దర్శనాన్ని అమలు చేసేందుకు ఈ మేరకు ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.