జార్ఖండ్‌లో మరో విషాదకర ఘటన..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్య

వాస్తవం సినిమా: ఢిల్లీలో బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటనను మర్చిపోకముందే ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రైవేటు కంపెనీని నిర్వహిస్తున్న దీపక్ కుమార్.. తన తల్లిదండ్రులు, సోదరుడు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీపక్ సోదరులు ఇద్దరు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, మిగతా కుటుంబ సభ్యులు మంచంపై పడి ఉన్నారు. దీపక్ ఝా కుమారుడు, కుమార్తె కూడా మంచంపై చనిపోయి కనిపించారు. దీపక్ ఝా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించి అప్పుల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలకు అదే కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీపక్ కుమార్తె కోసం స్కూలు బస్సు వచ్చి ఆగినా ఇంటి లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఓ విద్యార్థి బస్సు దిగి తలుపు కొట్టగా అది తెరుచుకుంది. లోపల మృతదేహాలు కనిపించడంతో భయంతో పరిగెత్తుకెళ్లి ఆ విద్యార్థి డ్రైవర్‌కు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.