కుల్ దీప్ కు ఎప్పుడైనా అవకాశం రావచ్చు: రవిశాస్త్రి

వాస్తవం ప్రతినిధి: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20, వన్డే సిరీసుల్లో తనదైన ప్రత్యేక బౌలింగ్‌ ప్రదర్శనతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించాడు కుల్‌దీప్‌ యాదవ్‌. ఈ ప్రదర్శనతో అతడు ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. కానీ, మరోపక్క సీనియర్లైన రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కూడా జట్టులో ఉన్నారు. దీనితో కుల్ దీప్ కు తుది జట్టులో స్థానం దక్కడం పై అనుమానాలు వ్యఖ్తం అవుతున్నాయి.  తాజాగా ఇదే ప్రశ్న భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి ఎదురైంది. ‘కుల్‌దీప్‌కు ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడే అవకాశం తప్పకుండా దక్కుతుంది. కానీ, అది ఏ టెస్టులో అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేమని, అతనికి ఎప్పుడైనా అవకాశం రావొచ్చు అని అన్నారు. అలానే అతనికంటే అనుభవజ్ఞులైన అశ్విన్‌, జడేజా కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడించాలా ఒక్క స్పిన్నర్‌తో ఆడించాలా అన్న అంశం మాకు తలనొప్పిగా మారింది అని రవి శాస్త్రీ అన్నారు. అనంతరం రిషబ్‌ పంత్‌ ఎంపిక గురించి ప్రశ్నించగా.. అతడో గేమ్‌ ఛేంజర్‌, భారత్‌-ఎ తరఫున ఆడి పరుగులు సాధించాడు, భారత జట్టుకు మరో వికెట్‌ కీపర్‌ అవసరం ఉంది. అందుకే ఎంపిక చేశాం అని బదులిచ్చాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఎలాంటి ఆందోళన చెందకుండా, మా బలాలను నమ్ముకుని సహజమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం అని రవిశాస్త్రి చెప్పాడు.