ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి మోదీ కి ఆహ్వానం!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ కాబోయే ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కి కూడా ఆ ఆహ్వానం అందనున్నట్లు తెలుస్తుంది. మరైతే ఈ ఆహ్వానాన్ని మన్నించి మోదీ పాక్ కి వెళ్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. జులై 25న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 115 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 22 మంది సభ్యులు అవసరం. చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్ట్ 11న తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కూడా ఇమ్రాన్ ప్రకటించారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పార్టీ కోర్ కమిటీ.. మోదీతోపాటు ఇతర సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని భావిస్తున్నది. దానికి తోడూ ఇటీవల మోదీ స్వయంగా ఫోన్ చేసి ఇమ్రాన్‌కు అభినందనలు తెలపడం కూడా ఒక సానుకూల అంశం గా వారు భావిస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పార్టీకి చెందిన నేత ఒకరు వెల్లడించారు. ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించే విషయాన్ని పార్టీ అధికారప్రతినిధి ఫవద్ చౌదరి కూడా తోసిపుచ్చలేదు. విదేశాంగ శాఖతో సంప్రదించి దీనిపై పార్టీ రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ఫవద్ స్పష్టంచేశారు. గ‌తంలో మోదీ కూడా త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి సార్క్ దేశాధినేత‌ల‌ను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.