ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో ధోనీ ఆటతీరు పై స్పందించిన హస్సీ

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ లో విఫలమైన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై మాజీ ఆటగాళ్లు విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ తాజగా స్పందించారు. ధోనీ కేవలం రెండు మ్యాచ్‌లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. దీనికే అతడిపై ఇంతగా విమర్శలు గుప్పించడం సరికాదు అని హస్సీ అంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో హస్సి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలు అందించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోనూ హస్సి ఆడాడు. ప్రస్తుతం హస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌) జరుగుతోన్న సంగతి తెలిసిందే. హస్సి ఈ లీగ్‌కు ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఫామ్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు హస్సి మాట్లాడుతూ… ‘ధోనీ ఇంగ్లాండ్‌ పర్యటనలో రెండు ఇన్నింగ్స్‌లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. ధోనీ ఏంటో, ఎలా ఆడతాడో మన అందరికీ తెలుసు. మధ్యలో కొన్ని సార్లు ఏ ఆటగాడైనా గాడి తప్పుతాడు. ఇది అందరికీ జరిగేదే. ధోనీ తప్పక తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడు. ఎన్నో ఏళ్ల పాటు అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు సరిగా ఆడలేదన్న కారణంగా అతడు అందించిన విజయాలను మరిచిపోతే ఎలా. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అతడి సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం. మ్యాచ్‌ చివర్లో వికెట్ల వెనుక నిల్చుని బౌలర్లకు ధోనీ ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యమైనవి. అవన్ని మరవొద్దు’ అని హస్సి అన్నాడు.