సెల్‌ఫోన్ పేలుడు, తెగిపడిన బాలుడి వేళ్లు!

వాస్తవం ప్రతినిధి: సెల్‌ఫోన్ పేరు చెబితే పెద్దలేకాదు చిన్నారులు సైతం వణుకుపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని పెండేకల్లు గ్రామంలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌‌లో పాటలు వింటుండగా చేతిలోని సెల్‌ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో బాలుడి చేతివేళ్లు తెగిపడ్డాయి. వివరాల ప్రకారం.. జనార్దన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు తండ్రి మొబైల్ ఫోన్ తీసుకుని పాటలు వింటుండగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. బాలుడి చేతి వేళ్లు తెగి పడడంతోపాటు పొట్టకు కూడా గాయమైంది. దీంతో వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.పేలిన ఫోన్ చైనా సెల్‌‌ఫోన్‌ అని గ్రామస్థులు చెబుతున్నారు. బాధిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు.

సెల్‌ఫోన్లు పేలడం ఇదేమీ కొత్తకాదు. గతంలో అనంతపురం జిల్లా తూమకుంటలో ఫోన్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుక్కిల్-రాణి దంపతుల ఏడేళ్ల కుమారుడు లలిత్ పాడైన బ్యాటరీతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.