వైసీపీ,జనసేన పార్టీ లపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి ప్రత్తిపాటి

వాస్తవం ప్రతినిధి: ఏపీ మంత్రి ప్రత్తి పాటి పుల్లా రావు మరోసారి వైసీపీ,జనసేన పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేన కలసి కుట్ర పన్నుతున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అసలు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పవన్ ఎవరని ఆయన ప్రశ్నించారు. పవన్ అమరావతి పర్యటన వెనుక బీజేపీ ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేస్తూపోతే ప్రజలు, రైతులు తిరగబడతారని హెచ్చరించారు. కేవలం చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు వేలాది ఎకరాల భూమిని రాజధాని కోసం ప్రభుత్వానికి అప్పగించారని వ్యాఖ్యానించిన ఆయన రాజధాని కారణంగా పేద దళిత రైతుల భూముల విలువ కోట్లకు చేరుకుందనీ, ఇప్పుడు రాజధానిని అడ్డుకోవడం ద్వారా పవన్ వారందరికీ అన్యాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ వైసీపీ నేతలు కేసులతో రాజధానిని అడ్డుకునేందుకు యత్నిస్తే, తాజాగా అమరావతిని అడ్డుకుంటామని పవన్ చెప్పడం దారుణమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలోని దళిత రైతులకు అన్యాయం చేయొద్దని ప్రత్తిపాటి హితవు పలికారు.