రాజస్థాన్ లో దారుణ ఘటన….షెడ్డు కూలి పలువురికి గాయాలు!

వాస్తవం ప్రతినిధి: రాజస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ట్రాక్టర్ రేస్ కోసం వచ్చిరేకుల షెడ్డు ఎక్కిన జనం ఒక్కసారిగా ఆ షెడ్డు కూలిపోవడం తో పలువురు గాయపడ్డారు. ప్రతి ఏడాది నిర్వహించే ట్రాక్టర్‌ రేస్‌ చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అయితే రేసు సరిగ్గా కనిపించడం లేదని పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డు ఎక్కారు కొంతమంది. ఈ క్రమంలో వందల మంది ఆ షెడ్డుపైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. దీనితో వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. రేకుల షెడ్డు కూలిన అనంతరం అక్కడ తొక్కిసలాట కూడ చోటుచేసుకుంది. దీంతో చాలా మందికి గాయాలయ్యాయి. పదంపుర ప్రాంతంలోని అనాజ్‌ మండిలో జరిగిన ట్రాక్టర్‌ రేస్‌ను చూసేందుకు సుమారు 5వేల మంది తరలి వచ్చారు. ప్రతీ ఏడాది అక్కడ జరిగే ఉత్సవాల్లో భాగంగా ట్రాక్టర్‌ రేస్‌ను నిర్వహిస్తారు. జనాలు చాలా ఎక్కువగా రావడంతో రేస్‌ను చూసేందుకు చాలా మంది రేకుల షెడ్డుపైకి ఎక్కారు. వందలాది మంది ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.. కానీ ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని శ్రీ గంగానగర్‌ జిల్లా ఎస్పీ యోగేష్‌ యాదవ్‌ వెల్లడించారు. క్షతగాత్రులను పదంపుర ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ట్రాక్టర్‌ రేస్‌ నిర్వహకులు తమ వద్ద అనుమతులు తీసుకోలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి ఏడాది వేలాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమంపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.