మళ్లీ చాలా సంవత్సరాల తరువాత మైదానంలోకి అడుగుపెట్టిన కపిల్!

వాస్తవం ప్రతినిధి: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కపిల్ దేవ్ చాలా సంవత్సరాల తరువాత మళ్లీ మైదానం లోకి అడుగుపెట్టాడు. ఇంతకీ క్రికెట్ మైదానంలోకి కాదండి గోల్ఫ్ కోర్టు లోకి అడుగుపెట్టారు. 24ఏళ్ల క్రితం క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కపిల్‌.. ఆ తర్వాత నుంచి తన దృష్టిని గోల్ఫ్‌ వైపు మళ్లించాడట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆటవైపు తన అడుగులు ఎలా పడ్డాయో కపిలే స్వయంగా చెప్పాడు. ‘ఒకరోజు గోల్ఫ్‌ ఆడదామని నా స్నేహితుడు ఒకరు పిలిచారు. క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన తర్వాత మళ్లీ నేను ప్రజల మధ్య ఆడకూడదనుకున్నానని తనకి చెప్పాను. అప్పుడు దానికి సమాధానంగా నీకలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. నిన్ను ఎవరూ చూడరు. ఎక్కడో లోపల నలుగురి స్నేహితులతో ఆడుకోవచ్చని నన్ను ప్రోత్సహించాడు. అంతే అప్పటి నుంచి క్రమంగా గోల్ఫ్‌ ఆడటానికి ఆసక్తి చూపాను’ అని కపిల్‌దేవ్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ క్రీడకు సంబంధించి కొన్ని మెలకువల చూపాడు. ‘ఇందులో మన శక్తి, సామర్థ్యమంతా మన శరీర ఆధీనంలో ఉంటే చాలు. విజయం మనదే. తప్పు చేశావని ఒకరిపై వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. అదే నాకు బలాన్ని చేకూర్చింది. ఎప్పుడైనా తప్పుగా ఆడానంటే నన్ను నేను తిట్టుకునే అవకాశం ఉంటుంది’ అని ఈ మాజీ క్రికెటర్‌ చెప్పాడు. అయితే కపిల్‌ దీనిని ఏదో సరదాగా ఆడటానికే పరిమితం కాలేదు. 2015లో చైనాలో నిర్వహించిన గోల్ఫ్‌ టోర్నమెంట్‌లోనూ కపిల్‌దేవ్‌ పాల్గొన్నాడు. మళ్లీ జులైలో నోయిడాలో నిర్వహించిన ఆల్‌ ఇండియా సీనియర్‌ టోర్నమెంట్‌లో అర్హత సాధించి.. జపాన్‌లో 2018 ఆసియా పసిఫిక్‌ సీనియర్స్‌ టోర్నమెంట్‌కు భారత గోల్ఫ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్‌ 17-19తేదీల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారు కూడా.