మరో కుంభకోణం లో లాలూ, ఆయన కుటుంబ సభ్యులు!

వాస్తవం ప్రతినిధి: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ని వరుస కుంభకోణాల కేసులతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు రుజువుకావడం తో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐ.ఆర్‌.సి.టి.సి) కుంభకోణంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌, అతని భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజశ్వి యాదవ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు సోమవారం పేర్కొంది. ఈ నేపధ్యంలో వారంతా కూడా ఆగస్టు 31న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2006కు సంబంధించిన ఈ కేసులో ఐఆర్‌సిటి ఆధ్వర్యంలో నిర్వహించిన రాంచీ, పూరీలోని సుజాత హోటల్స్‌లో లాలూ, ఇతరులు అవినీతి ఆరోపణలు పాల్పడినట్లు వెల్లడైంది. నిందితులపై తగిన సాక్ష్యాలు లభ్యమయ్యాయని చెబుతూ గత ఏప్రిల్‌ 16న ఈ కేసులో సిబిఐ చార్జీషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జీషీట్‌లో లాలూ, అతని కుటుంబ సభ్యులతోపాటు, మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్‌ చంద్‌ గుప్తా, అతని భార్య సరళ గుప్తా, ఐఆర్‌సిటిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.కె.అగర్వాల్‌, ఐఆర్‌సిటిసి డైరెక్టర్‌ రాకేష్‌ సక్సేనా పేర్లను కూడా చేర్చింది. వీరితో పాటు ఐఆర్‌సిటిసి గ్రూప్‌ జనరల్‌ మేనేజర్స్‌ వి.కె. అస్తానా, ఆర్‌కె గోయల్‌, సుజాత హోటల్స్‌, చాణక్య హోటల్‌ డైరెక్టర్లు విజరు కొచ్చర్‌ పేర్లను కూడా చార్జిషీట్‌లో నమోదు చేసింది. కాగా, ఈ కేసులో ఐఆర్‌సిటిసి గ్రూప్‌ మాజీ మేనేజర్‌ను మంగళవారం విచారించడానికి రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆమోదించినట్లు తెలుస్తుంది.