ప్రముఖ భారతీయ అమెరికన్ పై జాత్యహంకార దాడి!

వాస్తవం ప్రతినిధి: మసాచుసెట్స్‌ సెనేటర్‌ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ భారతీయ అమెరికన్‌ శివ అయ్యదురైపై జాత్యాహంకార దాడి  జరిగింది. గ్రేట్‌ బారింగ్టన్‌లో గతవారం ఈ ఘటన చోటుచేసుకోగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల అయ్యదురై స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. మసాచుసెట్స్‌ ప్రస్తుత సెనేటర్‌, డెమోక్రటిక్‌ నేత ఎలిజబెత్‌ వారెన్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. గ్రేట్‌ బారింగ్టన్‌లోని ఓ టౌన్‌హాల్‌ వద్ద వారెన్‌ మద్దతుదారులు గతవారం గుమిగూడారు. పక్కనే మెగాఫోన్‌ పట్టుకొని మాట్లాడుతున్న అయ్యదురై వైపునకు.. వారెన్‌ మద్దతుదారుల్లో ఒకరైన పాల్‌ సొలొవాయ్‌(74) దూసుకెళ్లారు. మెగాఫోన్‌ను భారతీయ అమెరికన్‌ నేత ముఖం మీదకు గట్టిగా నెట్టారు. దీంతో ఆయన పెదవుల నుంచి రక్తం కారింది. ఈ ఘటనను జాత్యాహంకార దాడిగా అయ్యదురై అభివర్ణించారు.