ప్రపంచ చాంపియన్ షిప్ కు సిద్దమైన స్టార్ ప్లేయర్లు

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తో మరో సారి స్టార్ ప్లేయర్లు అలరించనున్నారు.  ఈ ప్రపంచ చాంపియన్ షిప్ లో దేశానికి తొలి పతకం అందించింది ప్రకాశ్‌ పదుకొణె (1983) అయినప్పటికి  భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసింది మాత్రం సింధునే. 2013, 2014లలో కాంస్యాలతో మెరిసిన సింధు.. 2017లో రజతం గెల్చుకొని మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2015లో రజతంతో సత్తాచాటిన సైనా నెహ్వాల్‌.. 2017లో కాంస్యం సాధించింది. 2011లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ కాంస్యం గెల్చుకుంది. ఇప్పటి వరకు మొత్తం 7 పతకాలు సాధించిన భారత్‌.. ఈసారి స్వర్ణంపై కన్నేసింది. మహిళల సింగిల్స్‌లో సింధు, సైనా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌లు భారత్‌ తరఫున ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. ప్రపంచ టోర్నీలో 3 పతకాలు గెల్చుకున్న సింధు.. నిరుటి ఫైనల్లో నొజొమి ఒకుహర (జపాన్‌)తో పోరాడిన తీరు అద్భుతం గా నిలిచింది. ఆ మ్యాచ్ లో సింధు పోరాడిన తీరును చూసినవారంతా కూడా సింధు రజతం సాదించినప్పటికి స్వర్ణం గెలిచినట్లుగా భావించారు. అయితే ఈ ఏడాది ఇంకా బోనీ కూడా చేయని సింధు ఈ చాంపియన్ షిప్ లో స్వర్ణం పై గురిపెట్టింది.