పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ శివాజీ

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తామన్న పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు హీరో శివాజీ. అమరావతిని ఆపేస్తామంటూ రెచ్చగొడుతున్న నేతలు.. దాన్ని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. గుంటూరు కేజేఎస్ఎస్ ప్రాంగణంలో గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షతన ‘మేధావుల మౌనం-సమాజానికి శాపం’ అనే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. పవన్, జగన్‌లు ప్రత్యేక హోదా అంశాన్ని తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని దుయ్యబట్టారు.

నమ్మకద్రోహం, నయవంచన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేటెంట్‌గా తీసుకుందని, ఆంధ్రులంటే అంత చులకనా మీకు వచ్చే ఎన్నికల్లో తెలుగుజాతి పౌరుషం ఏంటో చూపిస్తారని సవాల్ విసిరారు శివాజీ. ప్రధాని 54 దేశాలు తిరిగినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేక పోయారని, కానీ చంద్రబాబు రూ.లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న శివాజీ అందరూ గట్టిగా నిలబడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. హోదా కోసం రైళ్లను ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, చిత్త శుద్ధి ఉన్నవారు తనతో కలిసి రావాలని సవాలు విసిరారు.