తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన

వాస్తవం ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది.తాచుపాముకు గుడి కట్టేందుకు ఆ గ్రామస్థులు సిద్దమవుతున్నారు. వివరాల ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పొలాల్లోకి వచ్చిన ఓ గోదుమ రంగు త్రాచుపాము రెండు వారాలు దాటినా అక్కడి నుంచి కదలక పోవడంతో, జనం తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తున్నారు. తొలుత పామును పట్టి దూరంగా విడిచిపెట్టినా, అది తిరిగి అక్కడికే రావడంతో, సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామే తమ ఊరికి వచ్చాడని, జనం పూజలు చేస్తున్నారు.

ఆ పాము నాగేంద్రుడని చెబుతూ, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేస్తున్నారు. అప్పుడప్పుడూ పడగ విప్పుతున్న ఆ పాము, ఎవరిపైనా దాడులు చేయడం గానీ, కాటేసేందుకు గానీ రాకపోతుండటంతో అది దైవ మహిమేనని, దీనికి గుడి కట్టించాలని దుర్గాడ గ్రామస్థులు నిర్ణయించారు. పలువురు మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. కాగా, వృద్ధాప్యంలో ఉన్న ఆ పాము ఎటూ కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయిందని తెలుస్తోంది.